ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సపోర్టు ఎవరికి ?


ANDRAPRADESH, AMARAVATHI: వైసీపీ ఆవిర్భావం నుంచి పొత్తుల వైపు చూడకుండా ఒంటరిగా పోటీ చేస్తూ వస్తోంది. వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలను వైసీపీ ఎదుర్కొంది. By:  Satya P   |   14 Aug 2025 7:00 AM Share: ఏపీలో ఒంటరి పోరు, దేశంలో తటస్థ పార్టీగా ముద్ర ఇదీ వైసీపీ రాజకీయ పంధా. వైసీపీ ఆవిర్భావం నుంచి పొత్తుల వైపు చూడకుండా ఒంటరిగా పోటీ చేస్తూ వస్తోంది. వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలను వైసీపీ ఎదుర్కొంది. ఈ మూడూ సోలో ఫైట్ ఇచ్చింది. రెండు సార్లు ఓటమి పాలు చెందింది. ఒకసారి భారీ విజయం దక్కించుకుంది. అయినా సరే తమ స్టాండ్ ఇదే అని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇక చూస్తే 2029లో కూడా వైసీపీది ఒంటరి పోరే. అందులో రెండవ మాట లేదని అంటున్నారు. 


అనివార్యమైన పరిస్థితుల్లో : 
ఇక వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఇంత క్లియర్ గా ఉన్న కొన్ని అనివార్యమైన పరిస్థితులలో ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఓట్లు వేయాల్సి వస్తోంది. అవి ముఖ్యంగా రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికలు. దేశంలో ప్రతీ అయిదేళ్లకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇవి పూర్తిగా రాజ్యాంగ బద్ధమైన పదవులు. అయినా సరే వెనక రాజకీయ పార్టీల మద్దతు ఉంటుంది. బీజేపీ నాయకత్వంలోని ఎండీయే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిల నుంచే ఈ రాజ్యాంగ పదవులకు అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. దాంతో వైసీపీ లాంటి తటస్థ పార్టీలకు ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది ఎపుడూ ఒక ప్రశ్నగా ఉంటోంది. అదే సమయంలో వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఇండైరెక్ట్ గా అయినా తెలుస్తుంది అని అంటున్నారు. 

ఈసారి వైసీపీ ఆలోచన : 
వెనక్కి వెళ్ళి చూస్తే 2012లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా ఉంటూ ఆనాటి యూపీఏ కూటమి బలపరచిన ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్రణబ్ వైపే మొగ్గు చూపి ఆశ్చర్యపరచింది. అయితే రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో రాజకీయాలు చూడరాదు అన్నది తమ పార్టీ సిద్ధాంతం అని వైసీపీ చెప్పుకుంది. 

ఎండీయే వైపే అలా : 
ఇక ఆ తరువాత 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాం నాధ్ కోవింద్ కి వైసీపీ మద్దతుగా ఓటేసింది. అలాగే ఉప రాష్ట్రపతి పదవికి తెలుగు వారు అయినా వెంకయ్యనాయుడుకు ఓటేసింది. ఇక 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి అలాగే ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతుగా ఓటేసింది. అయితే మధ్యలో జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. 

త్రాస్ ఎటు వైపో : 
ఇపుడు చూస్తే 2024లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. వైసీపీ ఏపీలో ఎన్డీయే మీద పోరాటం చేస్తోంది. మరి ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. దాంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇస్తుందా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక రాజకీయంగా చూస్తే 2024 ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ విషయంలో టీడీపీకి బీజేపీ సహకరించింది అన్న అనుమానాలు వైసీపీలో ఉన్నయని అంటున్నారు. అంతే కాదు ఏపీలో పోలింగ్ నాడు ఓట్లకు కౌంటింగ్ నాడు ఓట్లకు మధ్య 12.5 శాతం అదనంగా ఉన్నాయని జగన్ ఆరోపించారు. మరి ఈ నేపధ్యంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. 

అవసరం ఉందా : 
ఇక చూస్తే ఇండియా కూటమి కూడా బలమైన అభ్యర్ధిని పెట్టబోతోంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎలక్ట్రోల్ కాలేజీలో మొత్తం ఓట్లు 750 దాకా ఉంటే అందులో సగానికి కంటే ఎక్కువ అంటే 430 దాకా ఎన్డీయే కు ఉన్నాయని చెబుతున్నారు దాంతో ఎన్డీయేకు ఏ ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని అంటున్నారు. అయితే మరో వైపు చూస్తే బీజేపీ ఈ ఓట్లను చూసుకుని ఆగేది ఉండదని అంటున్నారు. మద్దతు పార్టీలను సాధ్యమైనంత ఎక్కువగా కూడగట్టి గట్టిగానే ఇండియా కూటమిని ఓడించాలని చూస్తుంది. అలాంటపుడే వైసీపీ మద్దతు అత్యంత కీలకం అవుతుంది. మరి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఏమిటో చూడాల్సి ఉంది అని అంటున్నారు