ANDRAPRADESH, AMARAVATHI: అమరావతిలో ప్రత్యేక కాల్ సెంటర్ నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారి రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారి రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాజధాని అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ప్రారంభించారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు సుమారు 215 మంది నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారని, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు ఢిల్లీలోని విదేశాంగ అధికారులు, ఏపీ భవన అధికారులతో సంప్రదింపులు జరుపుతూ నేపాల్ లో మన రాష్ట్రం వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
కాల్ సెంటర్ ఏర్పాటు
అంతేకాకుండా ఇంకెవరైనా నేపాల్ లో చిక్కుకున్నారా అనే సమాచారం తెలుసుకోవడంతోపాటు అక్కడ ఉన్న వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేశ్ ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి ధైర్యం కల్పిస్తున్నారు.
వీడియో కాల్ మాట్లాడిన మంత్రి లోకేష్
నేపాల్ లో చిక్కుకుని స్వరాష్ట్రానికి ఇబ్బంది పడుతున్న వారిలో ధైర్యం తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేశ్, వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభకు కాల్ చేసి నేపాల్ లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని, అక్కడ అందబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకబు చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్ లో చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్ లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న చోటే ఉండాలని, బయటకు రావొద్దని అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
ఈ నంబర్లకు కాల్ చేయండి
నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): +977 – 980 860 2881 / +977 – 981 032 6134 ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, EXT : 8001, 8005 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com మరియు info@apnrts.com,లనైనా సంప్రదించాలని సూచించింది.
ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
నేపాల్ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో తెలుగు వారు చిక్కుకున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. వీరందరికీ ఎప్పటికప్పుడు ఆహారం అందజేయడంతోపాటు వారి భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు సమీక్ష నిర్వహించాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
Social Plugin